1946 భారత ప్రాదేశిక ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1946 భారత ప్రాదేశిక ఎన్నికలు
← 1937 1946 1952 →

1585 ప్రాదేశిక స్థానాలు
  First party Second party Third party
 
Leader అబుల్ కలాం ఆజాద్ ముహమ్మద్ అలి జిన్నా పురాణ్ చంద్ జోషి
Party భారత జాతీయ కాంగ్రెస్ ఆలిండియా ముస్లిం లీగ్ సిపిఐ
Leader's seat పోటీ చెయ్యలేదు బైకుల్లా పోటీ చెయ్యలేదు
Seats won 923 425 8

బ్రిటిషు భారతదేశంలో 1946 జనవరిలో భారతీయ ప్రావిన్సుల శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ప్రాంతీయ ఎన్నికలు జరిగాయి. [1] భారతదేశంలో బ్రిటిషు పాలనలో చివరిగా జరిగిన ఎన్నికలు ఇవి. చిన్న రాజకీయ పార్టీలు నిర్మూలించబడినందున, రాజకీయ దృశ్యం భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లకు మాత్రమే పరిమితమైంది. అవి రెండూ గతంలో కంటే ఎక్కువగా పరస్పరం వ్యతిరేకించుకున్నాయి. 1937 ఎన్నికల పునరావృత్తంలో కాంగ్రెస్ 90 శాతం సాధారణ ముస్లిమేతర స్థానాల్లో గెలుపొందగా, ముస్లిం లీగ్ ప్రావిన్సులలో అత్యధిక ముస్లిం స్థానాలను (87%) గెలుచుకుంది. ఏది ఏమైనప్పటికీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ భారతీయ ముస్లింలకు ఏకైక ప్రతినిధిగా తన గుర్తింపును ధృవీకరించుకుంది.[2][3] ఈ ఎన్నికలు పాకిస్థాన్‌కు బాటలు వేశాయి.[4][3] [5]

నేపథ్యం

[మార్చు]

1945 సెప్టెంబరు 19 న, ఇంగ్లాండు నుండి భారతదేశానికి 1946 లో వచ్చిన మంత్రివర్గ బృందానికి భారతీయ నాయకులకూ మధ్య జరిగిన చర్చల తరువాత, వైస్రాయ్ లార్డ్ వేవెల్, ప్రాంతీయ కేంద్ర శాసనసభలకు 1945 డిసెంబరు నుండి జనవరి 1946 వరకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించాడు. ఈ ఎన్నికల తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని, రాజ్యాంగ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు.[1][6] ఈ విధంగా ఏర్పడిన ప్రావిన్షియల్ అసెంబ్లీలు స్వతంత్ర భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించడం ప్రారంభించే కొత్త రాజ్యాంగ సభను ఎన్నుకుంటాయి కాబట్టి ఈ ఎన్నికలు ముఖ్యమైనవి. పోటీలో ఉన్న పార్టీలన్నీ ప్రచారాన్ని ప్రారంభించాయి. కాంగ్రెస్ యావత్తు భారతీయ జనాభాకూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్నామని వాదించగా, ముస్లిం లీగ్, తాము మొత్తం ముస్లిం జనాభా తరఫున మాట్లాడతామని పేర్కొంది. [7] ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రధాన అంశం పాకిస్థాన్ సమస్య.[4] [8] [9]

మొదట్లో ముస్లిం లీగ్‌కు ముస్లింలు మైనారిటీగా ఉన్న ప్రావిన్సులలో చాలా మద్దతు ఉండేది. అక్కడి ముస్లిముల్లో హిందూ 'ఆధిపత్యం' భయం ఎక్కువగా ఉండేది. ముస్లింలకు ఒక దేశం ఉండాలనే తన వాదనను వినిపించడం కోసం లీగ్‌కు ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రావిన్సుల నుండి కూడా మద్దతు అవసరం. ఎన్నికల ప్రచారంలో, ముస్లిం-మెజారిటీ ప్రావిన్సులలో మద్దతును పొందేందుకు, భూస్వాములు, మతపరమైన ఉన్నతవర్గాల వంటి సాంప్రదాయిక అధికార స్థావరాలతో నెట్‌వర్క్‌లను లీగ్ స్థాపించుకుంది. మతపరమైన నినాదాలను వాడుకున్నారు. 'పాకిస్తాన్' అనే పదాన్ని ముందుకు తెచ్చారు. కొంతమంది పండితులు "పాకిస్తాన్" అనే మాటకు అర్థం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరుగా కనబడేలా దాని అర్థాన్ని కావాలనే అస్పష్టంగా ఉంచారని అంటారు.[10] కానీ, పాకిస్తాన్ అర్థాన్ని అస్పష్టంగా ఉంచలేదనీ, దానిపై వచ్చిన ప్రతిపాదనలను బహిరంగంగా తీవ్రంగా చర్చించారని, మ్యాప్‌లు ముద్రించారనీ, ఆర్థిక పునాదులను విశ్లేషించారనీ, పాకిస్తాన్ ఒక ఆధునిక ఇస్లామిక్ రాజ్యంగా ఊహించుకున్నారనీ వెంకట్ ధూళిపాళ అన్నాడు.[11][12]

మునుపటి ఎన్నికలకు భిన్నంగా, మతపరమైన నిబద్ధత ముస్లిం మత ఐక్యత ప్రకటనతో ముడిపడి ఉంది. ఓటు వేయడం ఇస్లామిక్ చర్యగా మారింది.[13] పర్యవసానంగా, ముస్లిం ఓటర్ల ఆలోచనల్లో పాకిస్తాన్ అనేది ముస్లింల కోసం ప్రత్యేకించిన దేశం అనే భావన ఏర్పడీంది. ఇది ఇస్లామిక్ రాజకీయాల మేల్కొలుపు అని, ఇక్కడ ఇస్లాం, పరిపాలనలో మిళితం అవుతుందనీ భావించారు.[14]

బ్రిటిషు పాలనలో అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఆస్తి, విద్యార్హతలను బట్టి ఓటు హక్కు పరిమితంగా ఉండేది. 1946 ఎన్నికలలో అలా కాకుండా, భారతీయ వయోజన జనాభాలో నాలుగో వంతు మందికి వోటు హక్కు కల్పించారు.[15][16][17]

ఫలితాలు

[మార్చు]

మొత్తం 1,585 సీట్లలో, కాంగ్రెస్ 923 (58.23%)[18] ఆల్-ఇండియా ముస్లిం లీగ్ 425 సీట్లు (మొత్తం 26.81%) గెలుచుకున్నాయి. లీగ్, కేంద్ర సభ లోని అన్ని ముస్లిం నియోజకవర్గాలతో పాటు ప్రాంతీయ శాసనసభలలోని చాలా ముస్లిం నియోజకవర్గాలను గెలుచుకుంది.[19][20] ఈ ఓటు పాకిస్థాన్‌కు మార్గం తెరిచింది.[3][21] విడివిడి ఎన్నికల వ్యవస్థ వలన ముస్లిం పోటీదారులు ముస్లిమేతర పోటీదారులను ఎదుర్కోకుండా, ఇతర ముస్లిం అభ్యర్థులతో మాత్రమే పోటీ పడేలా నిర్ధారిస్తుంది. ఈ విధంగా, పాకిస్తాన్ స్థాపనపై ప్రధానంగా ముస్లింలలోనే చర్చ జరిగింది.[22]

ముస్లిం లీగ్ బెంగాల్‌లో అతిపెద్ద విజయం సాధించింది. అక్కడ ముస్లింలకు కేటాయించిన 119 సీట్లలో 113 గెలుచుకుంది. ముస్లిం మైనారిటీ ప్రావిన్సులలో లీగ్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. యునైటెడ్ ప్రావిన్సెస్‌లోని 64 ముస్లిం సీట్లలో 54, బీహార్‌లోని 40 ముస్లిం సీట్లలో 34 గెలుచుకుంది. ఇది బొంబాయి, మద్రాసు లోని ముస్లిం స్థానాలన్నిటినీ స్వాధీనం చేసుకుంది. ముస్లింలకు ప్రతినిధి తామే అని ప్రదర్శించింది.[4][3]

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 108 మంది అభ్యర్థులను నిలబెట్టగా, వారిలో 8 మంది మాత్రమే గెలుచారు.[23] 1942 క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇవ్వకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఎదురుదెబ్బ తగిలింది.[24] గెలిచిన ఎనిమిది సీట్లలో ఏడు కార్మిక ప్రతినిధులకు రిజర్వ్ చేసినవి. మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ 2.5% ఓట్లను సాధించింది. రెండు ప్రధాన పార్టీలతో పోలిస్తే పోటీలో బాగా వెనకబడి ఉన్నప్పటికీ, ఓట్ల పరంగా కమ్యూనిస్టులు మూడవ శక్తిగా మారారు.[23] ఎన్నికైన కమ్యూనిస్ట్ అభ్యర్థులలో జ్యోతి బసు (బెంగాల్‌లోని రైల్వే నియోజకవర్గం), రతన్‌లాల్ బ్రాహ్మిన్ (డార్జిలింగ్), రూపనారాయణ్ రే (దినాజ్‌పూర్) ఉన్నారు.[25]

నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఫలితాలు మార్చిలో వచ్చాయి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వ్యక్తిత్వం కారణంగా కాంగ్రెస్ బలమైన మెజారిటీని సాధించి, ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.[18]

పంజాబ్‌లో, ముస్లిం లీగ్ సమిష్టి కృషి దాని గొప్ప విజయానికి దారితీసింది. మొత్తం ముస్లిం సీట్లలో 75 స్థానాలను గెలుచుకుంది. అసెంబ్లీలో అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించింది. సమైక్యవాద పార్టీ మొత్తం 20 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ 43 సీట్లు గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా నిలవగా, సిక్కు కేంద్రంగా ఉన్న అకాలీదళ్ 22 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది.[18] యూనియనిస్ట్ పార్టీకి చెందిన ఖిజర్ హయత్ ఖాన్ కాంగ్రెస్, అకాలీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.

అస్సాంలో, కాంగ్రెస్ అన్ని సాధారణ స్థానాలనూ గెలుచుకుంది. వాటిలో ఎక్కువ భాగం ప్రత్యేక అంశాల కోసం రిజర్వ్ చేయబడ్డాయి. తద్వారా స్థానిక ప్రభుత్వం ఏర్పడింది. ముస్లిం సీట్లు అన్నింటిని ముస్లిం లీగ్ గెలుచుకుంది. [18]

ముస్లిం మెజారిటీ ప్రావిన్స్ అయిన సింధ్‌లో ముస్లిం లీగ్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ కూడా బలమైన ఫలితాలను సాధించింది. ముస్లిం లీగ్ నుండి ఫిరాయించిన నలుగురు ముస్లింలతో ప్రభుత్వంలో సంకీర్ణాన్ని ఏర్పాటు చేయాలని మొదట భావించింది. చివరి నిమిషంలో, నలుగురు ముస్లిం అసమ్మతివాదులలో ఒకరు ముస్లిం లీగ్‌కి తిరిగి వెళ్లి, ఒక స్థానం మెజారిటీని కలిగించారు. కాంగ్రెస్ అప్పుడు, ముగ్గురు యూరోపియన్ సభ్యులను తమకు మద్దతు ఇవ్వమని లాబీయింగ్ చేయగా, వారు తిరస్కరించారు. ముస్లిం లీగ్‌ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సింధ్ గవర్నర్ కోరారు.[18]

శాసనసభలు

[మార్చు]
ప్రావిన్స్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఇతర పార్టీలు స్వతంత్రులు మొత్తం
అస్సాం 58 31 యూరోపియన్లు 9 ఇతరులు 3
7 108
బెంగాల్ 86 113 యూరోపియన్లు 25 ఇతరులు 12
14 250
బీహార్ 98 34 8 12 152
బొంబాయి 125 30 2 18 175
మధ్య ప్రాంతాలు 92 13 7 112
మద్రాసు 163 28 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2 [26] 22 215
నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ 30 17 2 1 50
ఒరిస్సా 47 4 9 60
పంజాబ్ 51 73 అకాలీలు 22 యూనియనిస్ట్ పార్టీ 20 మజ్లిస్-ఇ అహ్రార్-ఇ ఇస్లాం 2

7 175
సింధ్ 18 28 10 4 60
యునైటెడ్ ప్రావిన్సులు 153 54 7 14 228
మొత్తం 923 425 123 114 1585

మొత్తం ముస్లిం లీగ్ పనితీరు

[మార్చు]

రాబర్ట్ స్టెర్న్ ప్రకారం, లీగ్ విజయంలో మతపరమైన భావోద్వేగం కనబడింది. పంజాబ్‌లో కూడా పాకిస్తాన్ పట్ల సమ్మతి లేని యూనియనిస్ట్ పార్టీకి లీగ్‌కూ మధ్య జరిగిన పోరులో మతపరమైన ఆకర్షణ కారకంగా ఉంది.[27]

ప్రావిన్స్ ముస్లిం సీట్లు ముస్లిం లీగ్ గెలుపు %
అస్సాం 34 31 91%
బెంగాల్ 119 113 95%
బీహార్ 40 34 85%
బొంబాయి 30 30 100%
సెంట్రల్ ప్రావిన్సులు 14 13 93%
మద్రాసు 29 29 100%
NWFP 36 17 47%
ఒరిస్సా 4 4 100%
పంజాబ్ 86 74 86%
సింద్ 34 28 82%
యునైటెడ్ ప్రావిన్స్ 66 54 82%
మొత్తం 492 429 87%

[28]

ప్రావిన్స్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఇతరులు మొత్తం సీట్లు
అస్సాం 98 31 19 108
బెంగాల్ 86 113 51 250
బీహార్ 98 34 20 152
బొంబాయి 125 30 20 175
సీపీ. 92 13 71 112
మద్రాసు 165 29 21 215
N.W.F.P 30 17 3 50
ఒరిస్సా 47 4 9 60
పంజాబ్ 51 73 51 175
సింధ్ 18 27 15 60
యు. పి. 154 54 21 228
మూలంః ఎన్. ఎన్. మిత్ర (ed. ఇండియన్ యాన్యువల్ రిజిస్టర్, 1946, వాల్యూమ్. I, pp. 230-231.[29] 

ఛటర్జీ, జె. (2002). బెంగాల్ డివైడెడ్: హిందూ కమ్యూనలిజం అండ్ పార్టిషన్, 1932-1947 (సంఖ్య 57). కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్.[30]

అనంతర పరిణామాలు

[మార్చు]

అస్సాం, బీహార్, బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సులు, మద్రాస్, NWFP, ఒరిస్సా, యునైటెడ్ ప్రావిన్స్‌లలో కాంగ్రెస్ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసింది. ముస్లిం లీగ్ బెంగాల్, సింధ్‌లో తన మంత్రివర్గాలను ఏర్పాటు చేసింది. పంజాబ్ ప్రావిన్స్‌లో కాంగ్రెస్, యూనియనిస్ట్ పార్టీ, అకాలీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.[31]

పంజాబ్ ప్రావిన్స్‌లో ఖిజార్ హయత్ తివానా, ఛోటూ రామ్, తారా సింగ్ వంటి ప్రముఖ పంజాబీ ముస్లిం, హిందూ, సిక్కు నాయకుల ఆధ్వర్యంలో, లౌకికవాద యూనియనిస్ట్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అప్పటి పంజాబ్ ముస్లిం లీగ్ ప్రారంభించిన ప్రచారం కారణంగా ఎలా కూలిపోయిందో శర్మ, మధులిక చక్కగా అందించారు.[32] ముస్లిం లీగ్, (పంజాబ్) సంకీర్ణ ప్రభుత్వాన్ని 'ప్రాతినిధ్యం లేని' ప్రభుత్వంగా భావించింది. అటువంటి ప్రభుత్వాన్ని (ఇది చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అయినప్పటికీ) పడగొట్టడం తమ హక్కు అని భావించింది. ముస్లిం లీగ్ (పి) పంజాబ్‌లో AIML నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సిక్కుల మద్దతును పొందడంలో విఫలమైన తర్వాత, జిన్నా లియాఖత్ అలీ ఖాన్‌లు పూర్తిగా మద్దతిచ్చిన 'శాసన ఉల్లంఘన' ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇది 1946 మలి భాగంలో పంజాబ్‌లో మతపరమైన అల్లర్లకూ, రక్తపాతానికీ దారితీసింది.

1947 ప్రారంభంలో, ప్రావిన్స్‌లో శాంతిభద్రతల పరిస్థితి పౌర జీవితం పూర్తిగా స్తంభించే స్థాయికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లోనే 1947 మార్చి 2 న సంకీర్ణ నేతృత్వంలోని యూనియనిస్ట్ పార్టీకి చెందిన పంజాబ్ ప్రీమియర్ ( ముఖ్యమంత్రి ) ఖిజార్ హయత్ తివానా రాజీనామా చేయవలసి వచ్చింది. అదే రోజు ఆయన మంత్రివర్గం రద్దయింది. ఖిజార్ ప్రభుత్వం స్థానంలో వేరే ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశ లేకపోవడంతో, అప్పటి పంజాబ్ గవర్నర్ సర్ ఇవాన్ జెంకిన్స్ మార్చి 5 న పంజాబ్‌లో గవర్నర్ పాలన విధించాడు. ఇది విభజన రోజు వరకు అంటే 1947 ఆగస్టు 15 కొనసాగింది.

22 స్థానాలతో అకాలీ-దళ్ సిక్కులు, ఖిజర్ ప్రభుత్వాన్ని రద్దు చేయడంపై కాంగ్రెస్ (51), యూనియనిస్ట్ పార్టీ (20)తో పాటు సంకీర్ణంలో ప్రధాన వాటాదారులుగా ఉన్న సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. ఈ నేపథ్యంలోనే 1947 మార్చి 3 న, అకాలీ సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ పంజాబ్ అసెంబ్లీ వెలుపల తన కిర్పాన్‌ను పైకెత్తి బహిరంగంగా 'పాకిస్తాన్‌ నశించాలి, అది కావాలని కోరేవారికి రక్తం దక్కాలి' అని చెప్పాడు. అప్పటి నుండి పంజాబ్, చరిత్రలో మునుపెన్నడూ చూడని రక్తపాతంతో కూడిన మతకలహాల్లో మునిగిపోయింది. చివరికి, పంజాబ్‌ను భారత, పాకిస్తానీ పంజాబ్‌లుగా విభజించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో, భారీ సంఖ్యలో ప్రజలు ఊచకోతకు గురయ్యారు. లక్షలాది మంది శరణార్థులయ్యారు. పంజాబ్‌లో అన్ని మతాలకూ చెందిన వేలాది మంది మహిళలు అపహరణకు, అత్యాచారాలకూ, హత్యలకూ గురయ్యారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Vohra, Ranbir (2013) [First published 1997]. The Making of India: A Political History (3rd ed.). M. E. Sharpe. p. 176. ISBN 978-0-7656-2985-2.
  2. Barbara Metcalf; Thomas Metcalf (2006). A Concise History of Modern India (PDF) (2nd ed.). Cambridge University Press. pp. 212–213. ISBN 978-0-511-24558-9.
  3. 3.0 3.1 3.2 3.3 Ian Talbot; GuSingh (23 July 2009). The Partition of India. Cambridge University Press. p. 36. ISBN 978-0-521-85661-4.
  4. 4.0 4.1 4.2 Nadeem F. Paracha (11 May 2014). "The election that created Pakistan". Dawn. Retrieved 20 August 2019.
  5. Mateen Hafeez (1 September 2009). "Jinnah's constituency gears up for elections". The Times of India. Retrieved 20 August 2019.
  6. Sen, S. N. (1997). History of the Freedom Movement in India (1857–1947) (3rd ed.). New Age International. p. 317. ISBN 978-81-224-1049-5.
  7. Yasmin Khan (2007). The Great Partition: The Making of India and Pakistan. Yale University Press. p. 31. ISBN 978-0-300-12078-3. While the Congress claimed to speak for all Indians, irrespective of religion, the League claimed to be the mouthpiece of all Muslims.
  8. Yasmin Khan (2007). The Great Partition: The Making of India and Pakistan. Yale University Press. p. 32. ISBN 978-0-300-12078-3. Before long, though, economic issues were supplanted by a more trenchant issue. The campaigning focal point quickly emerged as Pakistan.
  9. Victor Sebestyen (2014). 1946: The Making of the Modern World. Pan Macmillan UK. pp. 246–. ISBN 978-1-74353-456-4. ...it became a plebiscite on one issue: whether Muslims should be granted a separate state, Pakistan – 'land of the pure'. Overwhelmingly, the Muslims voted in favor.
  10. Aparna Pande (2011). Explaining Pakistan's Foreign Policy: Escaping India. Taylor & Francis. pp. 11–. ISBN 978-1-136-81894-3.
  11. Dhulipala, Venkat (2015). Creating a New Medina. Cambridge University Press. p. 194. ISBN 978-1-107-05212-3.
  12. Talbot, Ian (2015), "Creating a New Medina: State Power, Islam and the Quest for Pakistan in Late Colonial North India. By Venkat Dhulipala", The Journal of Asian Studies, vol. 74, no. 4, pp. 1054–1055, doi:10.1017/S0021911815001461, ISSN 0021-9118
  13. Barbara Metcalf; Thomas Metcalf (2006). A Concise History of Modern India (PDF) (2nd ed.). Cambridge University Press. p. 214. ISBN 978-0-511-24558-9.
  14. Barbara Metcalf; Thomas Metcalf (2006). A Concise History of Modern India (PDF) (2nd ed.). Cambridge University Press. p. 215. ISBN 978-0-511-24558-9.
  15. Stern, R. W. (2001). Democracy and dictatorship in South Asia: dominant classes and political outcomes in India, Pakistan, and Bangladesh. Greenwood Publishing Group. p=37
  16. Vanderbok, W., & Sisson, R. (1988). Parties and Electorates from Raj to Swaraj: An Historical Analysis of Electoral Behavior in Late Colonial and Early Independent India. Social Science History, 12(2), 121-142. doi:10.1017/S0145553200016084
  17. Palshikar, S. (2006). The Promise of Democracy:‘Democracy’in the Pre-independence India. Project on State of Democracy in South Asia as part of the Qualitative Assessment of Democracy Lokniti (Programme of Comparative Democracy). Delhi: Centre for the Study of Developing Societies.
  18. 18.0 18.1 18.2 18.3 18.4 (April 1946). "The Indian Elections – 1946".
  19. Barbara D. Metcalf; Thomas R. Metcalf (2012). A Concise History of Modern India. Cambridge University Press. pp. 213–. ISBN 978-0-511-24558-9..
  20. Brown, Judith Margaret (1994). Modern India: the origins of an Asian democracy. Oxford University Press. pp. 328–329. ISBN 978-0-19-873112-2. The acquiescence of the politically aware (though possibly not of many villagers even at this point) would have been seriously in doubt if the British had displayed any intention of staying in India.
  21. Sajjad, M. (2014). Muslim Politics in Bihar: Changing Contours. Taylor & Francis. p. 221. ISBN 978-1-317-55981-8.
  22. David Gilmartin (2009). "Muslim League Appeals to the Voters of Punjab". In Barbara D. Metcalf (ed.). Islam in South Asia in Practice. Princeton University Press. pp. 410–. ISBN 978-1-4008-3138-8.
  23. 23.0 23.1 Gene D. Overstreet; Marshall Windmiller (1959). Communism in India. University of California Press. pp. 236–237. OCLC 502979.
  24. Sharma, Shalini (2010). Radical Politics in Colonial Punjab: Governance and Sedition. Routledge. p. 7. ISBN 978-0-203-86969-7.
  25. Samāddāra, Raṇabīra (2007). The Materiality of Politics. Anthem Press. p. 45. ISBN 978-1-84331-276-5.
  26. Andrew Wyatt (2010). Party System Change in South India: Political Entrepreneurs, Patterns, and Processes. Routledge. p. 56. ISBN 978-0-203-86220-9.
  27. Robert W. Stern (2001). Democracy and Dictatorship in South Asia: Dominant Classes and Political Outcomes in India, Pakistan, and Bangladesh. Greenwood Publishing Group. p. 27. ISBN 978-0-275-97041-3.
  28. "-- Schwartzberg Atlas -- Digital South Asia Library". dsal.uchicago.edu.
  29. (August 1946). "The Annual Register".
  30. Chatterji, Joya (1994). Bengal divided : Hindu communalism and partition, 1932-1947. Cambridge [England]: Cambridge University Press. ISBN 0-521-41128-9. OCLC 28710875.
  31. Joseph E. Schwartzberg. "Schwartzberg Atlas". A Historical Atlas of South Asia. Retrieved 10 February 2017.
  32. (2012-12-13). "The Punjab bloodied, partitioned and cleansed: unravelling the 1947 tragedy through secret British reports and first-person accounts edited by Ishtiaq Ahmed".